హైదరాబాద్లో 15.8 శాతం పెరుగుదల
హైదరాబాద్లో 15.8 శాతం పెరుగుదల
దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. గతేడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో దేశంలోని 13 ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ ధరలు వార్షికంగా 18.9 శాతం, త్రైమాసికాలవారీగా 3.97 శాతం మేర పెరిగినట్టు మ్యాజిక్ బ్రిక్స్ తన నివేదికలో వెల్లడించింది. గురుగ్రామ్ లో వార్షికంగా 32.1 శాతం ధరలు పెరగ్గా.. గ్రేటర్ నోయిడాలో 31 శాతం, నోయిడాలో 26.1 శాతం, హదరాబాద్ లో 15.8 శాతం మేర పెరుగుదల నమోదైనట్టు వివరించింది. మ్యాజిక్ బ్రిక్స్ ఫ్లాట్ ఫారమ్ లో ప్రాథమిక (మొదటిసారి అమ్మకం), ద్వితీయ (పున:విక్రయం) రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోని దాదాపు 2 కోట్ల మంది వినియోగదారుల ప్రాధాన్యతలు, డిమాండ్లను బట్టి ఈ నివేదిక రూపొందించారు.
ప్రాపర్టీల గురించి శోధించడం వార్షికంగా 2 శాతం పెరిగినప్పటికీ, ధరల పెరుగుదల కారణంగా త్రైమాసికంగా ఇది 16.9 శాతం తగ్గింది. ఇక రెసిడెన్షియల్ యూనిట్ల సరఫరా వార్షికంగా 16.9 శాతం తగ్గగా.. ముంబైలో 4.2 శాతం, హైదరాబాద్ లో 0.4 శాతం మాత్రం సరఫరా పెరిగింది. ‘రియల్ ఎస్టేట్ రంగానికి 2023 చాలా కీలకంగా పని చేసింది. బలమైన స్థూల ఆర్థిక అంశాలు, కస్టమర్ సానుకూల సెంటిమెంట్ తో రెసిడెన్షియల్ డిమాండ్ లో విపరీతమైన పెరుగుదల కనిపించింది. అయితే.. నివాస సరఫరా, పెరుగుతున్న గృహరుణ రేట్లు రెసిడెన్షియల్ ధరలపై ద్రవ్యోల్బణ ప్రభావాన్ని చూపించాయి. దీంతో త్రైమాసికంలో డిమాండ్ తగ్గింది. చిన్నచిన్న సవాళ్లు ఉన్నప్పటికీ, రెసిడెన్షియల్ డిమాండ్ సానుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. అలాగే సరఫరా పుంజుకోవడంతో ధరలు నియంత్రణలో ఉంటాయని భావిస్తున్నాం’ అని మ్యాజిక్ బ్రిక్స్ రీసెర్చ్ హెడ్ అభిషేక్ భద్ర అభిప్రాయపడ్డారు. కాగా, అహ్మదాబాద్ లో 62 శాతం, కోల్ కతాలో 48 శాతం మేర అందుబాటు ధరల గృహాల మార్కెట్ వృద్ధి చెందిందని, ఢిల్లీలో లగ్జరీ ప్రాపర్టీ ఎక్కువగా శోధించారని నివేదిక పేర్కొంది.