తొమ్మిదేళ్ల గరిష్టానికి ఇళ్ల విక్రయాలు, హైదరాబాద్ అదుర్స్
తొమ్మిదేళ్ల గరిష్టానికి ఇళ్ల విక్రయాలు, హైదరాబ ...
భారత్‌లో 2022 మొదటి అర్ధసంవత్సరంలో (జనవరి-జూన్) ఇళ్ల అమ్మకాలు తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో 14,693 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ రంగం వృద్ధి ఎనిమిది ప్రధాన నగరాల్లో 2021 మొదటి అర్ధ సంవత్సరంతో పోలిస్తే 60 శాతం పెరిగి 99,416 యూనిట్ల నుండి 1,58,705 యూనిట్లకు చేరుకుంది. అత్యధికంగా ఢిల్లీలో 154 శాతం వృద్ధి నమోదయింది. ఆ తర్వాత అహ్మదాబాద్ 54 శాతం, బెంగళూరు 80 శాతం, ముంబై 55 శాతం, కోల్‌కతా 39 శాతం, పుణే 25 శాతం, హైదరాబాద్‌లో 23 శాతం, చెన్నై 21 శాతంతో నిలిచాయి.
Real Broker Properties
హైదరాబాద్ విషయానికి వస్తే ఇళ్ల ధరలు గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. ఆరు నెలల్లోనే నాలుగు శాతం పెరిగాయి. ఐటీ రంగంపై కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉండంటంతో హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్ కొనసాగుతోందని తెలిపింది. దీనికి తోడు హోమ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం కూడా కలిసి వచ్చింది. హైదరాబాద్ రియాల్టీ రంగంలో గృహ నిర్మాణ రంగ వాటా 62 శాతం. కొత్తగా 21,356 ఇళ్లు నిర్మిస్తున్నారు. వార్షిక వృద్ధి 28 శాతంగా ఉంది.
రెసిడెన్షియల్ మార్కెట్‌లో ముంబై (44,200), ఢిల్లీ (29,101) తర్వాత బెంగళూరు (26,677) యూనిట్లుగా నిలిచింది. బెంగళూరులో సగటు యూనిట్ ధర ఏడాది ప్రాతిపదికన తొమ్మిది శాతం పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దాదాపు అన్ని నగరాల్లో ఇళ్ల ధరలు 3 శాతం నుండి 9 శాతం ఎగిశాయి. అన్ని నగరాల మార్కెట్లలో ధరలు పెరగడం 2015 జూలై-డిసెంబర్ తర్వాత ఇదే మొదటిసారి.