Real Estate in Hyderabad
Real Estate in Hyderabad
Real Estate: హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తోంది. నలు వైపులా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో భూముల ధరలు రెక్కలొస్తున్నాయి. అయినా ఎవరూ తగ్గట్లే. సొంత ఇల్లు, భూమి కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతుంది? ఎక్కడ పెట్టుబడి పెడితే ఆ సొమ్ము రెట్టింపు అవుతుంది, భవిష్యత్తుకు భరోసా ఉంటుందనే కోణంతో ఆలోచిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల వరకు రియాలిటీ దూసుకుపోయింది. ఆయా ప్రాంతాల్లో క్రమంగా భూముల ధరలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు నగరంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి ఆప్షన్ మాత్రం ఈస్ట్ హైదరాబాద్ అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న లుక్ ఈస్ట్ పాలసీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊపు తెప్పించిందని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ తూర్పు భాగంలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు లుక్ ఈస్ట్ పాలసీ తెచ్చింది తెలంగాణ సర్కార్. పలు కంపెనీల ఏర్పాటు కూడా వేగవంతం అయిందనే చెప్పాలి. వరంగల్ హైవేను అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ గా రూపొందించాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి చిరునామాగా మారబోతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
తూర్పు హైదరాబాద్ పెట్టుబడులకు సరైన ప్రదేశమని పలు నివేదకలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ప్రాంతంలో ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య ఏకంగా 91 శాతం పెరిగినట్లు నో బ్రోకర్ పేర్కొంది. ప్రధానంగా ఈస్ట్ హైదరాబాద్ లోని ఉప్పల్, పోచారం, రాంపల్లి, కీసర లాంటి ప్రాంతాల్లో రియల్ భూమ్ కనిపిస్తోందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో వాణిజ్య పరమైన ఆస్తులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందటా. మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ వేగంగా వస్తుండటం ఈ ప్రాంత భూములకు డిమాండ్ పెంచుతోంది. దీంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతం పెట్టుబడులకు మంచి ఆప్షన్ అనేది రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో భూములు, ఇల్లు లభిస్తుండటం ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊతమిస్తోంది. అయితే, పలు నివేదికల ప్రకారం ఈ సమాచారం అందిస్తున్నాయి. స్థానికంగా ఉండే ధరల్లో తేడాలు ఉండొచ్చు. అన్ని రకాలుగా వివరాలు తనిఖీ చేసుకున్న తర్వాతే భూములపై ఇన్వెస్ట్ చేయాలి.